Read more!

వ్యక్తి దృష్టి దేనిమీద ఉండాలో చెప్పే కథ!!

 

వ్యక్తి దృష్టి దేనిమీద ఉండాలో చెప్పే కథ!!


అనగనగా ఓ రాజ్యం, ఆ రాజ్యానికి ఓ రాజు ఉన్నాడు. ఆ రాజ్యం పొలిమేరల్లో ఉన్న అడవిలో ఓ గొప్ప తపస్వి ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ విషయం రాజుకు తెలిసింది. ఓ రాత్రి ఆ తపస్వి ఆశ్రమంలో గడపాలన్న కోరిక రాజుకు కలిగింది. తపస్వి అనుమతి కోసం రాజు, తన మంత్రిని ఆ తపస్వి ఆశ్రమానికి పంపాడు.


"స్వామీ!! మా రాజుగారు మీ ఆశ్రమంలో ఒక రాత్రి గడపాలని అనుకుంటున్నాడు. అందుకోసం మీ అనుమతి అడగమని పంపాడు" అని చెప్పాడు మంత్రి.


 రాజు కోరిక విని తపస్వి నవ్వి "సరే అలాగే!!" అని అనుమతినిచ్చాడు. 


అంత దూరం నుంచి వచ్చిన మంత్రి బడలిక గమనించిన తపస్వి ఒక గ్లాసులో పాలు తీసుకుని వచ్చి మంత్రికి ఇచ్చాడు. మంత్రి ఆ పాలు తాగి వాటి రుచికి ఆశ్చర్యపోయాడు.


"స్వామీ ఈ పాల రుచి అద్భుతంగా ఉంది. మీరు ఈ పాలు ఎక్కడ తెచ్చారు??" అని అడిగాడు మంత్రి. 


 తపస్వి "నేను ప్రత్యక్షంగా ప్రేమతో పెంచుతున్న ఆవు నుండి తీసిచ్చిన పాలు ఇవి"  అని చెప్పాడు. 


మంత్రి ఆశ్చర్యంగానే అక్కడినుండి వెళ్ళిపోయాడు.


మరుసటి రోజు మంత్రి రాజు కలసి ఆశ్రమానికి వెళ్లారు.  ఆ ఆవు పాలు రాజుకు ఇమ్మని ఆ తపస్వి శిష్యులకు ప్రత్యక్షంగా పురమాయించాడు మంత్రి. కానీ ఆ రోజు పాల రుచి అద్భుతంగా అనిపించలేదు సరికదా, మామూలుగా ఉన్నాయి పాలు.


 "నిన్న ఈ పాలు తాగి ఆవును కొనేద్దామనుకున్నాను. ధర ఎంతైనా పరవాలేదనుకున్నాను. కానీ ఇప్పుడు పాలు తాగిన తరువాత తొందరపడనందుకు సంతోషిస్తున్నాను" అన్నాడు మంత్రి రాజుతో సమయం చిక్కగానే. 


దానికి రాజు నవ్వి సమాధానం ఇచ్చాడు. "పాల రుచి నిన్న, ఇవాళ ఒకటే. తేడా నీ అనుభూతిలో ఉంది. నిన్న అలసిపోయి వచ్చావు. పాల రుచి అద్భుతంగా ఉంది. ఇవాళ్ళ అద్భుతమైన రుచిని ఊహిస్తూ వచ్చావు. పాల రుచి మామూలుగా ఉంది. ప్రపంచరీతి ఇది. అందుకే నువ్వు దృష్టిని, అనుభూతిని, మనస్సు స్థితిని బట్టి మారే పాల రుచిపై కాదు, ఎన్నటికీ మారని శాశ్వత సత్యాలను తెలిపే తపస్వి మాటలపై ఉంచాలి" అని చెప్పాడు రాజు.

మానవజీవితంలో అనుక్షణం విభిన్నమైన అనుభవాలు కలుగుతాయి. విభిన్నమైన అనుభూతులు అనుభవానికి వస్తాయి. అనుభవాలు గురువులు. ఒకో అనుభవం నేర్పే పాఠాన్ని అనుసరించి వ్యక్తి ఆలోచన విధానం ప్రభావితమవుతూ ఉంటుంది. అతని ఆలోచనల రూపురేఖలను మనస్సనే శిలపై అనుభవం చెక్కటం వల్ల వ్యక్తిత్వశిల్పం రూపు దిద్దుకుంటుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఒకే రకమైన అనుభవం వేర్వేరు వ్యక్తులలో వేర్వేరు అనుభూతులను కలిగిస్తుంది. వేర్వేరు స్పందనలకు కారణమౌతుంది. అనుభవాలకు వ్యక్తి స్పందన ఆరంభం నుంచీ అతనికి అందిన సంస్కారాలు, నేర్పిన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. 


అందుకే భారతీయ జీవనవిధానంలో ఆరంభం నుంచీ, అంటే శిశుజననం జరిగినప్పటి నుంచే కాదు, వీలైతే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచీ ఉత్తమాదర్శాలను అందించే ప్రయత్నం జరుగుతుంది. ఆరంభం నుంచీ మంచి మాటలు నేర్పటం, మంచి గుణాలను ఆకళింపు చేయటం వంటి పద్ధతులను పాటించటం జరుగుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలే కాదు మన సాహిత్యం సర్వం ఈ దిశలో ప్రయత్నించటం స్పష్టంగా కనిపిస్తుంది.

                                        ◆నిశ్శబ్ద.